Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 6:20 pm Posted by : ramakrishna

ప్రమాదాల నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

 

. . . అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపర్చేందుకు కృషి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాల గురించి, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం లైన్ డిపార్ట్ మెంట్స్ కు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలన్నారు.

 

Awareness programs should be conducted to control accidents.

 

వరి కోతల సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తూ విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన పెంపొందేలా విరివిగా ప్రచారం నిర్వహించాలని అన్నారు.  బ్లాక్ స్పాట్లుగా గుర్తించబడిన ప్రదేశాలలో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, తద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదాలకు కారణం అవుతున్న ఆక్రమణలను సంబంధిత శాఖలు సమన్వయంతో తొలగించాలని సూచించారు. పీ.ఎం రహ్ వీర్, పీ.ఎం రాహత్ కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ఆర్ అండ్ బీ ఈ.ఈ అజ్మీర, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎన్.ఐ.సీ అధికారి మధు, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ భాస్కర్, ఈ-దార్ మేనేజర్ హర్ష, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Awareness programs should be conducted to control accidents.