Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 9:01 pm Posted by : ramakrishna

మాదకద్రవ్యాల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు

  • జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక స్థాయి సమావేశంలో కలెక్టర్, సీపీ

 

నిజామాబాద్, బతుకమ్మ : మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకముందు అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తుండడం వల్ల అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని, కొంతమంది గర్భిణీ మహిళలు కూడా దీనిని సేవిస్తున్నట్లు తెలుస్తోందని, ఇది సదరు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీలు కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీని ఆదేశించారు.  ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించే అల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, గంజాయి వంటి మత్తు పదార్థాలను నియంత్రించే దిశగా అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. నిరంతర దాడులు కొనసాగిస్తూనే, వీటి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ గుర్తు చేశారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చని సీ.పీ సాయి చైతన్య  సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, డీఈఓ అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్, డీటీఓ ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.