. . . గురువారం నుంచి ఆరు రోజులపాటు ఇంటింటి ఆరోగ్య సర్వే
. . . డీఎంహెచ్‌వో డా. వెంకట్
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఇంటింటి ఆరోగ్య సర్వేపై వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై సర్వే నిర్వహణ, సమాచార సేకరణ విధానం, ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి బాన్సువాడ పట్టణంలో ఆరు రోజుల పాటు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య వివరాలను నమోదు చేసి, భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన డేటాను సేకరిస్తామని చెప్పారు. ప్రజలు సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించి, అవసరమైన వివరాలతో పాటు ఆధార్ కార్డు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు డిజిటల్ ఆరోగ్య రికార్డుల్లో నమోదు కావడంతో భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సేవలు, ఆరోగ్య పథకాలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.