Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 6:13 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాధులపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ,శ్వాస సంబంధిత వ్యాధులపై నిజామాబాద్ వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో గల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అపర్ణ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మమతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2-3 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలని సీజనల్ ఫ్లూ సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోతుందన్నారు. గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుడిని వెంటనే సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్, మేనేజర్ రాజశేఖర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.