. . . దిష్టిబొమ్మను లాక్కున్న పోలీసులు
. . . కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయటానికి ప్రయత్నించగా, వారి చేతిలో నుండి దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని, వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అనేక సంవత్సరాలుగా అధికారులకు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటంతో పాటు నిరసన ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినప్పటికీ, ప్రభుత్వం స్పందించలేదన్నారు. దాంతో కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి 40 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం చర్చించకుండా కాలయాపన చేసి కార్మికులు సమ్మెకు పూనుకునే పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె వలన భావోద్వేగాలకు గురైన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని, ప్రభుత్వం వెంటనే శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని, లేని యెడల కార్మికుల పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ అండగా ఉంటుందని ఆయనన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడనాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నేసాబ్, జంగం గంగాధర్ నగర నాయకులు అంజయ్య, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.