Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 4:26 pm Posted by : ramakrishna

కుల వివక్షతో రజక కుటుంబంపై దాడి చేయడం అమానుషం

 

. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మరి మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై కొందరు అగ్రవర్ణ దురహంకారులు జరిపిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని, ఈ సంఘటనను నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. అదేవిధంగా దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేశ్, మౌనిక, రెండు నెలల వారి పసి బిడ్డ, తల్లి, చెల్లిపై అగ్ర వర్ణ దురహంకారులు దాడి చేయగా, ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. అనంతరం రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గూపన్ పల్లి శంకర్ మాట్లాడుతూ ఒకవైపు ఢిల్లీలో ప్రపంచ ఏఐ సదస్సు జరుగుతుంటే మరోవైపు ఇంకా కుల వివక్షతో అగ్రకుల దురహంకారులు నిరుపేద కులాలపై దాడులు చేయడం హేయమని అన్నారు. ఒక దిక్కు హిందువులందరూ ఒకటే అంటుంటే మరో దిక్కు అగ్రవర్ణాల దురహంకారులు చిన్న కులాలపై ఇంకా చిన్న చూపు చూపడం చాలా బాధాకరమని అన్నారు. రజక నిరుపేద కుటుంబ పై దాడి చేసి పాప మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తో పాటు రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గూపన్ పల్లి శంకర్, దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, కొయ్యడ శంకర్, సాయి బసవ, రేఖ, బాలన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు.