Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2024, 3:46 pm Posted by : ramakrishna

అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి


Atrocity cases should be dealt with promptly

. అణగారిన ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వీడీసీలపై కఠిన చర్యలు

. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

. కలెక్టర్, సీపీ పనితీరు భేష్ అని కితాబు

నిజామాబాద్, బతుకమ్మ: అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో శుక్రవారం పోలీసు, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ  అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. బాధితుల నుంచి విజ్ఞాపనలను స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ..  పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నెల రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు,నాలుగు దశాబ్దాలుగా గ్రామాభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలు కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సీపీకి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పక్కాగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని హితవు పలికారు.  ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చక్కగా పని చేస్తున్నారని అభినందించారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి 41 సీ ఆర్ పీసీ కింద పోలీస్ స్టేషన్ లకు పిలిపించుకుని స్టేషన్ బెయిల్ ఇస్తుండడంతో అట్రాసిటీ చట్టం నీరుగారిపోయే ప్రమాదం నెలకొందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎస్ డీవో బి.నిర్మల, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Atrocity cases should be dealt with promptly