Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:46 pm Posted by : ramakrishna

హైడ్రా అభివృద్ధి చేసిన వేళ …

 

. . . ఉప్పల్ నల్ల చెరువుకు జలకళ

 

. . . వర్షాలతో చెరువుకు భారీగా వరద నీరు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైడ్రా పునరుద్ధరించిన ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పల్ నల్లచెరువు వరద నీరుతో నిండింది. భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారిన ఈ చెరువును హైడ్రా పునరుద్ధరిస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలో వర్షాలు పడినప్పుడు వరద నీరు చెరువులోకి చేరేలా.. తక్కువ మొత్తంలో పారే మురుగు నీరు బైపాస్ చేసిన కాలువలోంచి  బయటకు పోయేలా కాలువలను హైడ్రా అభివృద్ధి చేసింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువున ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వరదనీరు నల్లచెరువుకు చేరింది. ఉప్పల్ నల్లచెరువులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 70 ఎకరాల వరకు విస్తరించిన విషయం విదితమే. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది.

. . . ఇన్లెట్లు, ఔట్లెట్లు అభివృద్ధితో..

ఉప్పల్ నల్ల చెరువుకు ఎగువున ఉన్న నాచారం చెరువుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా రెండు ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు నిందిన తర్వాత వరద నీరు సాఫీగా మూసీకి చేరేలా ఔట్లెట్ను కూడా తీర్చిదిద్దింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన మెయిన్ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా గడిపే ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉప్పల్ నల్లచెరువును తీర్చిదిద్దుతున్నారు. హైడ్రా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమైన చెరువుల్లో ఉప్పల్ నల్లచెరువు ఒకటి. ఇప్పటికే మూడు చెరువులు ప్రజలకు అంకితం కాగా, అదే తరహాలో ఉప్పల్ నల్లచెరువు కూడా త్వరలో నగరానికి మరో అందమైన జలవనరుగా మారనుంది.