- మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. మణిదీప్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మోకాళ్లు, భుజాలు, మణికట్టులు వంటి కీళ్ల నొప్పులు తొలిదశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్ల దెబ్బతినడం నివారించవచ్చని నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.మణిదీప్ రెడ్డి అన్నారు. ఈ నెల 12 ఆదివారం ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ డా.మణిదీప్ రెడ్డి, డా.రామకోటేశ్వర రావు మాట్లాడుతూ కీళ్ల నొప్పులు వృద్ధాప్యానికి మాత్రమే పరిమితం కావని ఆధునిక జీవనశైలిలో వ్యాయామం లోపం, అధిక బరువు, ఒత్తిడి కారణంగా యువతలో కూడా ఆర్థరైటిస్ కేసులు వేగంగా పెరుగుతు న్నాయన్నారు. భారత్ లోనే సుమారు 18 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా వేశారు. ఆర్థరైటిస్ అనేది కీళ్లలో వాపు, నొప్పి, గట్టిపడడం కలిగించే వ్యాధి అని దీనిలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయన్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ ఇది కీళ్ల కండరాలు దెబ్బతినడం వల్ల వస్తుందని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా కీళ్లను దాడి చేసే ఆటోఇమ్యూన్ వ్యాధి అన్నారు.“తొలిదశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్ల దెబ్బతినడం నివారించవచ్చని, కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం గట్టిపడడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. అనంతరం డా. రామకోటేశ్వర రావు ఆర్థోపెడిక్ సర్జన్ మాట్లాడుతూ తగిన బరువును కాపాడుకోవడం, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, స్వచ్ఛందంగా మందులు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది అని తెలిపారు. ఆధునిక వైద్యపద్ధతులు కీళ్ల పునరుద్ధరణ శస్త్రచికిత్సలు ద్వారా ఆర్థరైటిస్ రోగులు కూడా సుఖమైన జీవితం గడపవచ్చన్నారు.