Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 5:48 pm Posted by : ramakrishna

రెండో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ రెండవ విడత నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో బోధన్ డివిజన్ లోని పది మండలాలు, నిజామాబాద్ డివిజన్ లోని నవీపేట మండలం కలుపుకుని 11 మండలాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ శనివారం సాయంత్రం నాటితో సజావుగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 30 నుండి డిసెంబర్ 02వ తేదీ వరకు రెండవ విడతగా నిజామాబాద్ డివిజన్ లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్ లోని జాక్రాన్పల్లి మండలాల పరిధిలోని 196 సర్పంచ్ స్థానాలకు, 1760 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో నామపత్రాలు దాఖలు చేయవచ్చని, డిసెంబర్ 02 చివరి తేదీ అని కలెక్టర్ సూచించారు. అన్ని కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల నియమావళిని విధిగా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కోరారు.