. . . స్వామి వారికి శావ సేవ, ఎడ్ల బండ్ల ప్రదక్షణ
. . . వేలాదిగా తరలిరానున్న భక్తజనం
. . . జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
వేల్పూర్, బతుకమ్మ :
మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ప్రతి యేటా మాఘమ అమావాస్య రోజున నిర్వహించే అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు గాను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సౌక్యారాలను స్థానిక రాజరాజేశ్వర ఆలయ కమిటీ పూర్తి చేసింది. గ్రామ శివారులోరెండు కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలసిన అయ్యల స్వామి జాతరకు సుంకేట్, మోర్తాడ్, దొన్ పాల్, బషీరాబాద్, చౌట్ పల్లి, హాసకొత్తూరు, కుప్కాల్, జగిర్యాల్, మోతె, వేల్పూర్, వెంకటపూర్, కుకనూర్, కోమన్ పల్లి తదితర గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. భక్తులు గుట్టకు వెళ్లేందుకు ఆర్టీసీ ఆర్మూర్ డిపో వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. వీరభద్ర స్వామి వెలసిన ఈ క్షేత్రంలో స్వామి వారిని గ్రామంలోని ఆలయం నుండి ఉదయం 9 గంటలకు చిన్న శావాలో ఉత్సవ మూర్తులను ఉంచి, పూలతో అందంగా అలంకరించి గ్రామంలో పురవీధుల గుండా డప్పులు, మంగళ వాయిద్యాలు, మంగళహారతులతో ఊరేగింపుగా గుట్టకు తీసుకొస్తారు. శావ వెంట మొక్కుకున్న భక్తులు కాలినడకన వస్తారు. శావను గ్రామంలో ఇంటింటా అపి స్వామికి సాహిత్యం, మంగళహారతినిచ్చి, కొబ్బరికాయలను కొట్టి మొక్కులను తీర్చుకొంటారు. గుట్టకు శావ చేరుకోగానే స్వామి ఉత్సవమూర్తులను శావా నుండి స్వామీవారి గద్దె పైన ప్రతిష్టించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అనంతరం స్వామి గద్దె వద్ద, స్వామి వారి కొండమీద గల ఆలయం పై జెండావిష్కరణ చేస్తారు. తదనంతరం యజ్ఞ కార్యక్రమం నిర్వహించి, బలి ప్రధానం చేస్తారు. ఇక స్వామి ఉత్సవమూర్తులను మరల శావాలో ఉంచి డప్పులు, మంగళహారతులతో శావను మోస్తూ బోహిలు ముందు నడవగా, వెనుక ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, కార్లు, బైక్ లు బారీగా కొండ చుట్టూ తిరుగుతూ స్వామి వారికి ప్రదక్షణ మొక్కును చెల్లించుకొంటారు. పాదయాత్రన కొండ ప్రదక్షణ చేసే భక్తుల శివనామస్మరణ తో అయ్యల గుట్ట మారుమరోగుతుంది. ఈ క్రతువంత ముగిసిన పిమ్మట భక్తులు అన్న ప్రసాదం తీసుకొంటారు. అనంతరం స్వామి వారిని చిన్న శావాలో గ్రామ పొలిమేర వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి పొలిమేరలో ఉన్న స్వామి గద్దె పైన ఉంచుతారు. అక్కడి నుండి స్వామి వారిని రాత్రి 8 గంటలకు పెద్ద శావాలో ఉంచి గ్రామంలోని వందలాది మహిళామణులు రాత్రంతా గ్రామంలో ఊరేగించి తెల్లవారు జామున గ్రామాలయానికి చేరి స్వామికి హారతినిచ్చి, ఉత్సవమూర్తులను గ్రామాలయంలో ఉంచుతారు.



