Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 4:10 pm Posted by : ramakrishna

అవినీతి కాంగ్రెస్ పడగ నీడలో ఆర్మూర్

  • కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి అక్రమ వసూళ్లు
  • యధేచ్చగా ల్యాండ్, ఇసుక మాఫియాల ఆగడాలు
  • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

 

ఆర్మూర్, బతుకమ్మ : అవినీతి కాంగ్రెస్ కమిషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిలలాడుతోంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ లోని తన నివాసంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పీ. వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్)అక్రమ వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, ఆయన దోపిడీ దొంగల ముఠా లీడర్ గా మారి ప్రజల సొమ్ము కాజేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్మూర్ ప్రజల దృష్టిలో పీవీఆర్ అంటే  పైసా వసూల్ రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. బినామీల ద్వారా అక్రమ వసూళ్ల   సునామీ సృష్టిస్తున్న పీవీఆర్ యధేచ్చగా ల్యాండ్, శాండ్ మాఫియాల ఆగడాలకు పాల్పడుతున్నారని, కల్లు బట్టీ నుంచి నల్లమట్టి దాకా మామూళ్ల వసూళ్లు చేస్తున్నారని, చివరకు టిఫిన్ సెంటర్ల నుంచి చికెన్ షాపులను వదలకుండా లూటీల పర్వం సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గాలి పీల్చినా వినయ్ రెడ్డికి కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పీవీఅర్ అవినీతి దాహానికి అన్ని వర్గాల వారూ బలవుతు న్నారని, నియోజక వర్గంలో చీమ చిటుక్కుమన్నా డబ్బుల కోసం డిమాండ్లు వస్తున్నాయని, వినయ్ రెడ్డి మాటకాదంటే అక్రమ కేసుల్లో రిమాండ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ల అండతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారులను తెచ్చుకుంటున్నారని, వారు నోటీసులు ఇవ్వడం, వినయ్ కుమార్ రెడ్డి వసూలు చేసుకోవడం పరిపాటైందన్నారు. పీవీఆర్ కోసం అక్రమ వసూళ్లకు తెగబడి ఏసీబీ వలలో చిక్కిన రాజ్ కుమార్ రియల్ ఎస్టేట్, ఆసుపత్రులు, పేద, ధనిక అనే తేడా లేకుండా  డబ్బులు దండుకొని కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ తో కలిసి వాటాలు పంచుకున్నారన్నారు. ఆర్మూరు పట్టణంలోని ఆనంద్ హాస్పిటల్ ను బెదిరించి రూ.50లక్షలు,ఆధ్య హాస్పిటల్ ను బెదిరించి రూ. 20లక్షలు గౌతమీ హాస్పిటల్ ను బెదిరించి రూ.20లక్షలు వసూలు చేసిన కమిషనర్ మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర బోర్ వెల్స్ భోజారెడ్డి, రవిగౌడ్ వెంచర్ ల ను బెదిరించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తాతను కట్టించిన ,18 ఫంక్షన్ హాళ్లను బెదిరించారని,  మామిడిపల్లి లోని నరసింహారెడ్డి వెంచర్ ను బెదిరించారని, తీగల నర్సారెడ్డి అపార్ట్ మెంట్ ను బెదిరించి అక్రమ వసూళ్ల దందా సాగించారని ఆయన మండిపడ్డారు. 470 కొత్త ఇండ్ల నెంబర్లు ఇవ్వడానికి 9కోట్లు వసూలు చేశారని, మామిడిపల్లి రైల్వే వంతెన నుంచి పెర్కిట్ వరకు 450ఇండ్లు,షాపులకు నోటీసులు ఇచ్చి డబ్బులు డిమాండ్ చేశారని ఆయన అన్నారు. నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్,ఆలూరు మండలాల్లో పోలీసుల అవినీతికి అడ్డేలేదన్నారు. పోలీసు సీఐ కల్లు బట్టీ లను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, చికెన్ షాపుల నుంచి తనకు, కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి ఇంటికి ప్రతీ రోజూ అవసరమైన చికెన్ ఉచితంగా పంపాలని హుకుం జారీ చేశారని జీవన్ రెడ్డి వెల్లడించారు. పంతు రోడ్డులో తరతరాలుగా ఉన్న షాపులకు నోటీసులు ఇచ్చి లంచాలు డిమాండ్ చేశారని, గోదాములు నిర్మిస్తున్న వారు కూడా పీవీఆర్ ధనదాహ  బాధితులేనని ఆయన చెప్పారు. కమిషనర్   అక్రమ వసూళ్లలో కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ కు భారీగా వాటాలు పంచి పెట్టాడన్నారు. వినయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి మరీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పీవీఆర్ వత్తిళ్ళకు లొంగి అవినీతికి కొమ్ముకాసిన ఒక ఎంవీఐ, పలువురు రెవెన్యూ అధికారులు,తాజాగా ఆర్మూర్ మునిసిపల్ కమిషనర్ రాజ్ కుమార్ ఏసీబీ వలలో చిక్కి జైళ్ల పాలయ్యారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.ఒక్క మున్సిపల్ కమిషనరే 20కోట్ల ఆస్తి అవినీతి ద్వారా కూడబెట్టుకున్నారంటే, ఇక కాంగ్రెస్ ఇంచార్జ్లు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన సోదరులు ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నారో అర్థం చేసుకోవాలని ఆయన నిప్పులు చెరిగారు. పీవీఆర్ అవినీతిపై జిల్లాకే చెందిన పీసీసీ చీఫ్ ఎందుకు నోరు మెదపడం లేదు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తానే  నేరుగా రంగంలోకి దిగి అవినీతి పరుల భరతం పడతానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ దోపిడికి గురవుతున్న బాధితుల పక్షాన పోరాడుతానని, ఇక నుంచి ఆర్మూర్ లోని తన ఇల్లే అవినీతి అనకొండలకు రిపేర్ చేసే జనతా గ్యారేజ్ అని, అవినీతికి బలవుతున్న బాధితులు ఎప్పుడైనా తన ఇంటి తలుపులు తట్టవచ్చని స్పష్టం చేస్తూ, తన, తన పీఏ ల ఫోన్ నంబర్లను ఇచ్చారు. అవసరమైతే కేటీఆర్, హరీష్ రావు లను ఆర్మూర్ కు రప్పించి  అవినీతి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ ఇంటిని అమ్మించి బాధితులకు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అడ్డుకునే బాధ్యత కలెక్టర్ దేనని, పోలీసు అధికారుల అవినీతికి సీపీ దే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి కళ్లెం వేయకుంటే కలెక్టరేట్, మున్సిపల్, ఎమ్మార్వో ఆఫీసుల ముట్టడి స్తామన్నారు. పదివేల మంది ప్రజలతో కలిసి దండయాత్ర చేస్తానని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్,మాజీ జడ్పిటిసి మెట్టు సంతోష్,మాజీ కౌన్సిలర్లు చక్రు,అల్జాపూర్ మహెంధర్,సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పోల సుధాకర్,నచ్చు చిన్నారెడ్డి,జిజి రామ్,పృథ్వి,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Armor in the shadow of the corrupt Congress