Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 2:55 pm Posted by : ramakrishna

రైతుల ఆక్రందన పట్టడం లేదా..?

. కొనుగోలు కేంద్రాల వైపు రైస్ మిల్లర్లు కన్నెత్తి చూడటం లేదు

. నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ మోసం చేసింది

. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: అధికారులు కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదని, రైతుల ఆక్రందన ప్రభుత్వానికి పట్టదా? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు 27 కిలోమీటర్ల పొడువునా రోడ్డు పక్కన రైతులు పోసిన ధాన్యం రాశులను జీవన్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా పోరాడుతామని, ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు కన్నీళ్లను దిగమింగుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రుణమాఫీ, రైతుభరోసా పేరుతో దగా చేసిందని, పంటల బోనస్ బోగస్ అని, పాత బోనస్ సొమ్మే ఇంత వరకు చెల్లించలేదని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా, 24 గంటల విద్యుత్ ఇస్తామని సిద్దులగుట్టపై శివయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఒట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

అన్నదాతలు ఆపదలో ఉంటే అధికార పార్టీ నేతలు ఎక్కడ నిద్రపోతున్నారని మండిపడ్డారు. ఏ గ్రామానికి వెళ్ళినా మళ్ళీ కేసీఆర్ వస్తేనే తాము కష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారన్నారు.