పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ ఇచ్చిన హామీ ఏమైంది?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వెబ్ న్యూస్, బతుకమ్మ : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని కవిత గుర్తు చేశారు. పసుపుకు కనీసం రూ. 9 వేలు రాని పరిస్థితి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నయవంచన, మోసం చేస్తున్నాయని ఆరోపించారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదన్నారు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీ ఏమైందని? కవిత ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.