Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 5:36 pm Posted by : ramakrishna

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలి

 

. . . కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం వినతి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తెలంగాణలో కీలక రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఢిల్లీలో గడ్కరీ నివాసంలో మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రింగ్ రోడ్డు (రీజినల్ రింగ్ రోడ్ – ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో పనులు ప్రారంభించేందుకు కేంద్ర మంత్రిమండలి నుంచి తక్షణ అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణ పనులను ఏకకాలంలో ప్రారంభిస్తే ప్రాజెక్టు త్వరగా పూర్తికావడమే కాకుండా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు. అలాగే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అన్ని అనుమతులను కూడా వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి తక్షణ అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల జాతీయ రహదారిని మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణ దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గడంతో పాటు, బందరు పోర్టుకు సరకు రవాణా మరింత వేగవంతమవుతుందని తెలిపారు. మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన అటవీ శాఖ అనుమతులు త్వరగా మంజూరు చేయించేందుకు సహకరించాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం జలాశయాల పరిధిలో ఈ ప్రాజెక్టు ఉండటంతో కేంద్ర స్థాయిలో ప్రత్యేక చొరవ అవసరమని వివరించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఆరు వరుసల కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణంతో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.