. . . 19 అసెంబ్లీ, 9 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జిల నియామకం
. . . రెండవ విడతలో బీసీ లకు పెద్దపీఠ
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించారు. సోమవారం ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించిన పార్టీ, రెండో విడతలో మరో 19 స్థానాలకు బాధ్యతలు అప్పగించింది. ఈ జాబితాలోనూ బీసీ వర్గాలకు పెద్దపీట వేసింది. మొత్తం 19 నియామకాల్లో 10 మంది బీసీ నాయకులకు అవకాశం కల్పించినట్లు పార్టీ తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో పాటు 9 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఇన్‌చార్జీలను నియమించారు. అలాగే తెలంగాణ రక్షణ సేన అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల నియామకాలను ప్రకటించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కనగల చైతన్య, ఉపాధ్యక్షురాలిగా అయిలి కవిత నియమితులయ్యారు. తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జానపాటి రాము యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మునుకుంట్ల నవీన్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా చింతలపాటి రాధశ్రీలను నియమించారు. తెలంగాణ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లంపల్లి రామకోటి, ప్రధాన కార్యదర్శిగా గొరిగె నర్సింహా, ఉపాధ్యక్షులుగా కుసుమ రజిత, ఈదుల కంటి శైలజ గౌడ్‌లను నియమించారు. ఇక పార్టీ జిల్లా స్థాయి బాధ్యతల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నడిపెల్లి వెంకటేశ్వర రావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కుందూరు దేవేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలిగా సుమలత సుధాకర్ శర్మలను నియమించారు. నిజామాబాద్ అర్బన్ పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జి గా ఎస్.ఎ అలీం ని నియమించారు.