. . . ప్రతి పాదనను సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వెబ్ డెస్క్, బతుకమ్మ :
యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిసి ఈ ప్రతిపాదనను సమర్పించారు. తెలంగాణలో యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని ముఖ్యమంత్రి వివరించారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలు కూడా దీనిని నిరూపిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో)తో పాటు 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. అదనంగా, 2014–15 వర్షాకాల పంటకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో వరి ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. పౌర సరఫరాల శాఖపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని పాత బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాలను తగ్గించేందుకు పంపిణీ చేస్తున్న పోషకాహార బియ్యం (ఎఫ్.ఆర్.కె) పంపిణీని ఇటీవల నిలిపివేశారని, దానిని వెంటనే పునఃప్రారంభించాలని కూడా కేంద్రాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కో-ఆర్డినేషన్ అద్వైత్ సింగ్‌తో పాటు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
