. . . పీఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమాజంలో ఐక్యత, భద్రత, పరస్పర గౌరవం పెంపొందించడమే దేశాభివృద్ధికి, శాంతికి పునాది అని, మానవత్వం, మంచితనం లేని ఏ మతమైనా సంస్కరించబడాల్సిందేనని పీఆర్ టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. నగరంలోని అర్సపల్లి సమీపంలోని నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో “మత సామరస్యం – సోదరభావం – ప్రస్తుత సమాజంలో” అనే అంశంపై ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వమత సమానత్వమే నిజమైన మానవత్వానికి ప్రతీక అని అన్నారు. అన్ని మతాలను గౌరవించడం, పరస్పర ప్రేమ, శాంతి, సయోధ్యతో కలిసి జీవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కుల, మత భేదాలు లేకుండా బాధితులకు ఆహారం, వస్తువులు అందించడం, ఆపదలో ఉన్న పేదలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం నిజమైన సోదరభావానికి నిదర్శనమని చెప్పారు. వృద్ధులు, చిన్నారుల పట్ల ఆప్యాయత, ఆదరణ చూపడం కూడా మానవత్వంలో భాగమేనని ఆయన అన్నారు. సమాజంలో మంచి, చెడు అనే రెండే మతాలు ఉన్నాయని పేర్కొంటూ, ఐక్యత, భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి వ్యక్తి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేస్తే స్వేచ్ఛ, శాంతి, సౌభ్రాతృత్వంతో కూడిన నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
