. . . ఈనెల 18న జరిగే టీయూసీఐ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ
మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర సదస్సును నిర్వహిస్తుందన్నారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకోవటం దుర్మార్గమన్నారు. ఇన్ని రోజులు వెనకడుగు వేస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోటే కేంద్రంలో ఉన్న కార్పొరేట్ అనుకూల విధానాల అమలును వేగవంతం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కోడ్ లు అమల్లోకి వస్తే కార్మికులు అనేక హక్కులను కోల్పోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేయటం కోసమే ఇలాంటి చర్యలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016 లో సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఈనాటి వరకు అమలు చేయని మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటు కంపెనీల అనుకూల విధానాలను విడనాడాలని హెచ్చరించారు. వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న హైదరాబాదులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్, డి.కిషన్, జిల్లా కోశాధికారి పి.సాయరెడ్డి, జిల్లా నాయకులు బి.మురళి, రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.