- 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
- మోడీ ప్రభుత్వానికి కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నివసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద సభ జరిపి, ధర్నా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ లు అధ్యక్షత వహించారు. ఈ సార్వత్రిక సమ్మెకు వక్తలుగా వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఓమయ్య, సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరు రాములు టీయుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య లు మాట్లాడుతూ.. సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొని జయప్రదం చేశారన్నారు. ఈ సమ్మె విజయం మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నదని ఆరోపించారు. అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతుందన్నారు. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఓట్లు సీట్లు దండుకుంటున్నదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ, ప్రజలను దోచుకుంటున్నదన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్రవేస్తూ, ప్రజాస్వామ్యవాదులను నిర్బంధిస్తున్నదన్నారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్మికులకు కనీస వేతనాలు 26వేలు, కనీస పెన్షన్ 9వేలు అమలు చేయాలన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి, ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకు విప్లవజేజేలు తెలియజేశారు. ఈ సమ్మెకు సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య లు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎం.వెంకన్న, రాజేశ్వర్, కిషన్, కిరణ్, రవి, శివకుమార్, స్వర్ణ, రేణుక, రాములు, దేవేందర్, సంధ్యారాణి, కవిత, లక్ష్మణ్, శ్రీనివాస్, రమేష్, మోహన్, సుకన్య, వాణి, స్వరూప, అక్షయ్, పరశురాం, గోవర్ధన్, వసంత, సుకన్య, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
