నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం పాత కలెక్టరేట్ వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ మైదానం నుంచి సాయి రెడ్డి పెట్రోల్ బంక్ వరకు కొనసాగింది. అవినీతి రహిత సమాజం కోసం నినాదాలు చేస్తూ ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. కరప్షన్ తో నష్టాలు, ఇబ్బందులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యాంటి కరప్షన్ బ్యూరో ద్వారా క్యూ ఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగిందని, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు సమాచారం అందించవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరప్షన్ అనేది క్రైమ్ లాంటిదని ప్రజలు స్పందించి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ డీసీపీ బసవరెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఏసీబీ అధికారులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
