- నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమయానికి అనుకూలంగా ఆహారాన్ని తీసుకోవడంతో మానవ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా జడ్జి టి.శ్రీనివాస్ కుమారుడు దేవాన్స్ జన్మదినం సందర్భంగా జిల్లాకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మధ్యాహ్న భోజన సమయంలో కోర్టులకు వచ్చిన కక్షిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సమయానికి భోజనం చేయడం మూలంగా ప్రతివారు తమ దైనందిన పనులను క్రమపద్ధతిలో చేసుకోగలుగుతారని ఆమె పేర్కొన్నారు. అన్నదాతలు తమ భూరివిరాళాన్ని అన్నదానం రూపంలో అన్నదాన వితరణ చేయాలని జిల్లాజడ్జి కోరారు. అదనపు జిల్లా జడ్జి టి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైనా తమకు అనుకూలమైన రోజులలో ,శుభ దినాలలో అన్నదానం చేయడం అలవర్చుకోవాలని కోరారు. సమాజానికి తమవంతు ఉడతాభక్తి సహాయం అందించాలని జడ్జి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్,బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వసంత్,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ తదితరులు పాల్గొన్నారు.