Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 4:53 pm Posted by : ramakrishna

అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచాలి

 

. . . కలెక్టరేట్ ముందు సిఐటియు ధర్నా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అంగన్ వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 18000 రూపాయలు ప్రభుత్వ హామీ మేరకు అమలు జరపాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అంగన్ వాడీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నూర్జహాన్ మాట్లాడుతూ 2023 లో 24 రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల అమలుతో పాటు, కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్ వాడీ కార్యకర్తలకు 18 వేల రూపాయలు వేతనం ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న, ఇచ్చిన హామీని అమలు జరపటం లేదని, అదే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిటైర్ అయ్యే అంగన్ వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని ఇచ్చినప్పటికీ అమలు జరపకుండా వందలాది మంది అంగన్ వాడీ టీచర్లు ఆయాలను రిటైర్మెంట్ ప్రకటించి వారికి ఎటువంటి ఆధారం కల్పించలేదని అన్నారు. గత పీఆర్ సీ ప్రకటించినప్పుడు అంగన్ వాడీ కార్యకర్తలకు మూడు నెలల ఏరియర్స్ ను బకాయిలు పెట్టారని, మినీ అంగన్ వాడీ టీచర్లకు పెంచిన వేతనాలు ఆరు నెలలకు పైగా బకాయిలు ఉన్నాయని, గతంలో అమలు జరిపిన ఇంక్రిమెంట్ లను, ఇన్ చార్జ్ అలవెన్స్ లను నిలిపివేయడం జరిగిందని తెలిపారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ఇచ్చే మెనూ చార్జీలను పెంచాలని, ఆన్ లైన్ రిపోర్టింగ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని,  ఐసిడిఎస్ తో సంబంధం లేని పనులను అంగన్ వాడీ లకు అప్పగించకూడదని, బిఎల్ఓ విధులను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంగన్ వాడీ సమస్యలపై ఛలో హైదరాబాద్ నిర్వహించడానికి నిర్ణయించిన సందర్భంలో అంగన్ వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నారని, మహిళలని కూడా చూడకుండా రాత్రులందు అరెస్టులు చేస్తున్నారని ఇదెక్కడి ప్రజా పాలన అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని యెడల భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవగంగు, పి.స్వర్ణ, కోశాధికారి పి చంద్రకళ, ఉపాధ్యక్షులు మంగాదేవి, సూర్య కళ, జిల్లా నాయకులు విజయ, గోదావరి, జ్యోతి, వాణి, లావణ్య, లక్ష్మి, సందీప, సరిత, తో పాటు పెద్ద ఎత్తున అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Anganwadi workers' salaries should be increased