- పలుచోట్ల డుమ్మాకొడుతున్న కొందరు టీచర్లు
- బాలామృతం బర్ల పాలు
- అంగన్వాడీ కేద్రాల పై పర్యవేక్షణ కరువు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా, వారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానిక ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్ కు వెళ్లి చూస్తే పిల్లలు వచ్చి కూర్చున్నాక కూడా టీచర్ రాకపోవడంతో అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న ఆయా అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు, సూపర్ వైజర్ అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
- క్షేత్రస్థాయిలో నెరవేరని లక్ష్యాలు..
పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణులను గుర్తించి వారికి పోషక విలువలుగల ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతే కేంద్రప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ లక్ష్యాలు మాత్రం నీరుగారిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలు కేంద్రాల్లో ఆయాలదే రాజ్యంగా నడుస్తోంది. టీచర్లు లేకపోవడంతో వారే అన్నీ చూసుకుంటున్నారు. ఆయాల్లో 80 శాతానికి పైగా నిరక్ష్యరాసులే కావడంతో ఏమీ చేయాలో తోచని స్థితిలో వారు ఉంటున్నారు.
- బాలామృతం బర్లపాలు..
అంగనవాడీ కేంద్రాలకువచ్చే చిన్నారులకు పౌష్టికాహారంగా అందించే బాలామృతం పశువుల దాణాగా మారుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి చిన్నారులకు చేరాల్సిన బాలామృతం పక్కదారులు పడుతోంది. లబ్ధిదారులు నుంచి కొంత మేరకు పక్కదారులకు పోతోంటే, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు బాలామృతంను నేరుగా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతం దాణాగా తీసుకుంటున్న గేదెలు పాలు అధికంగా ఇస్తోండటంతో బాలామృతం ప్యాకెట్లను నేరుగా వారికే కొందరు టీచర్లు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
