Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2024, 3:52 pm Posted by : ramakrishna

అనాథగా ఆలూరు బైపాస్ రోడ్డు

  • అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కారు
  • ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వ ఆలనాపాలనా లేక ఆలూరు బైపాస్ రోడ్డు అనాధగా మారిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆలూరు బైపాస్ రోడ్డు, అక్కడ నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ను గురువారం ఉదయం జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాకర్లతో, స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలూరు బైపాస్ రోడ్డు పొడవునా కరెంటు లైట్లు పెట్టడానికి కూడా ఆర్మూర్ మునిసిపాలిటీ లో డబ్బులు లేవా? అని నిలదీశారు. అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కారు అని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు.

Anathaga Aluru Bypass Road

ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మాణం స్థానిక ప్రజల తరతరాల కల అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకాపూర్ పర్యటన సందర్భంగా తాను చేసిన బైపాస్ రోడ్డు ఆందోళనను గుర్తు చేసి దాని కోసం అక్కడికక్కడే రూ.13కోట్లు మంజూరు చేసి భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీచేశారని జీవన్ రెడ్డి వివరించారు. ఆర్మూర్ మునిసిపల్ చైర్మన్, కమిషనర్ లు ఇకనైనా ఆలూరు బైపాస్ రోడ్డుపై శ్రద్దపెట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ. 13 కోట్ల రూపాయలతో నిర్మించిన నందిపేట్ డబుల్ రోడ్డు పొడవునా మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Anathaga Aluru Bypass Road