Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 10:18 pm Posted by : ramakrishna

అల్ ఫోర్స్ కాలేజిలో అరాచకం

  • అడ్మిషన్ టైంలో ఫీజులో రాయితీ అని ప్రచారం
  • ఫీజులు కట్టాలని విద్యార్థులకు వేదింపులు
  • మండిపడుతున్న తల్లిదండ్రులు

 

నిజామాబాద్, బతుకమ్మ : అధికార కాంగ్రెస్ పార్టీ నేత అల్ ఫోర్స్ కళాశాలలో ఫీజుల వేదింపులు పెరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఆల్ ఫోర్స్ కళాశాలను నిజామాబాద్ జిల్లాలో విస్తరించేందుకు యజమాన్యం ఫీజులో రాయితీని ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలో కొత్తగా బ్రాంచ్ లు ఏర్పాటు చేసి అడ్మిషన్ లను పెంచుకునేందుకు మార్కుల ఆధారంగా వంద శాతం ఫీజు రాయితీ, ఉచిత భోదన పేరిట అడ్మిషన్లు చేయించుకున్న యజమాన్యం ఇప్పుడు ఫీజులు కట్టాలని వేదింపులకు దిగింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యాలయం వద్ద తల్లిదండ్రులు నిత్యం అధికారులతో గొడవకు దిగుతున్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఫీజులు కట్టాలని ఆరుబయట నిలుచోబెట్టి చేస్తున్న అవమానం భరించలేక వారు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం బహిర్గతమైంది. కళాశాలలోని కార్యాలయాల వద్ద తల్లిదండ్రులు నిత్యం పడిగాపులు కాస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డుకు కాసుల గంతలు కట్టి ఉండడంతో వారు కన్నెత్తి చూడడం లేదు. ప్యాకేజి స్టార్ లుగా పేరున్న విద్యార్థి సంఘాలు విద్యార్థుల గోడును పట్టించుకోవడం లేదు.

జిల్లా కేంద్రంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలపై అనేక విమర్శలు వెళ్లితున్నాయి. గత ఏడాది జిల్లాలో ఇంటర్ విద్య బోధన ప్రారంభించిన ఈ కళాశాల ప్రారంభంలో అధిక అడ్మిషన్ల కోసం అనేక హామీలను ఇచ్చింది. ప్రారంభం మొదటి సంవత్సరంలోని పదవ తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు వచ్చిన వారు కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. వీరు మొదటి సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన తర్వాత రెండవ సంవత్సరం వచ్చేసరికి యాజమాన్యం రెట్టింపు ఫీజులు వసూలు చేస్తుంది. అడ్మిషన్ తీసుకునే ముందు ఇంటర్ పూర్తిగా ఉచితం అంటూ ప్రకటించిన యాజమాన్యం తర్వాత రెండవ సంవత్సరంలో ఒక్కో విద్యార్థికి 80 వేల రూపాయల చొప్పున ఫీజులు వసూలుకు బరి తెగించింది. ఈ ఫీజు కట్టకుంటే విద్యార్థులను గంటల తరబడి కళాశాల బయట నిలబెడుతున్నారు. గతంలో జరిగిన కళాశాల ఫ్రెషర్స్ డే పార్టీ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాని నరేందర్ రెడ్డిని ఫీజుల విషయంలో నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో తీవ్రవాగ్వివాదానికి దిగారు. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అయినా కూడా యాజమాన్యం తగ్గలేదు. నేను అధికార పార్టీలో ఉన్నాను మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అంటూ యాజమాన్యం పేర్కొంటుందని వారు పేర్కొన్నారు. కాగా బుధవారం కూడా చాలామంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం ముబారక్ నగర్ బ్రాంచ్ లో సుమారు గంటల తరబడి కళాశాల బయట నిలబెట్టారు. ఫీజు కట్టలేదని పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సాయంత్రం కళాశాలకు వచ్చి యాజమాన్యంతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ఫీజుల విషయానికి వస్తే యాజమాన్యమే తప్పుడు హామీ ఇచ్చిందని, ప్రస్తుతం ఫీజులు పూర్తిస్థాయిలో కట్టాలని ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదన్నారు. కానీ ఫీజుల విషయంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను గంటల తరబడి బయట ఎలా నిలబెడతారంటూ వాగ్వివాదానికి దిగారు. కళాశాలలో పనిచేసే సిబ్బంది యాజమాన్యం చెప్పిన విధంగానే మేము చేస్తున్నమంటూ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, ఇంటర్మీడియట్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. గతంలో ఇదే బ్రాంచిలో పనిచేస్తున్న ఉద్యోగిని కూతురు బాత్రూంలోకి వెళ్లిన విద్యార్థులను డోర్లు మూసివేసి గంటల తరబడి నిర్బంధించింది ఈ వ్యవహారాన్ని బయటకు పోకడకుండా యాజమాన్యం జాగ్రత్తలు పడింది. దుబ్బా బ్రాంచ్ లోనూ విద్యార్థులను ఫీజులు కట్టలేదని రోడ్డుపైన నిలబెట్టిన ఘటన జరిగింది. ప్రైవేట్ కళాశాల ఇష్టానుసారంగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అడ్మిషన్ సమయంలోనే ఫీజు వివరాలను స్పష్టంగా చెప్పకపోవడమే ఇబ్బందులకు కారణం తెలుస్తోంది.

  • సుభాష్ నగర్ లో అనుమతి లేకుండా..

నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఈ ఏడాది మరో బ్రాంచ్ ని ప్రారంభించింది. ఈ కళాశాలకు ఇప్పటివరకు అనుమతి లేదు. కేవలం ఒకే అనుమతి పై మూడు బ్రాంచ్లను కొనసాగిస్తున్నారు. అనుమతి లేని కళాశాలపై ఇంటర్ అధికారులు సైతం చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు ప్రత్యేక విద్య బోధనా అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది విద్య బోధన ప్రారంభించారు.

  • స్పందించని విద్యార్థి సంఘాలు..

విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నామని విద్యార్థి సంఘాలు అనుమతి లేని కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రైవేటు కళాశాలలపై స్పందించడం లేదు. వామపక్ష పార్టీ విద్యార్థి సంఘం నేత సదరు కళాశాలలో వివాదాలకు, బోర్డు నుంచి అధికారులను రాకుండా అడ్డుకుంటానని పెద్ద మొత్తంలో వసూల్ చేశాడని విద్యార్థి సంఘాలే ఆరోపిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ప్రతి ఏడాది చందాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తూ సదరు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్నారు. విద్యార్థుల సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో సమస్యలు పేరిట నిరసనలు చేపడుతున్నారు తప్ప కార్పొరేట్ కళాశాలలు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ప్రతి ఏడాది వివిధ ప్రత్యేక రోజులకు కార్పొరేట్ కళాశాలల నుంచి విద్యార్థి సంఘాలు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల వ్యవహారంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.