. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ అధికారులతో తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఇందూరు జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దినేష్ కులాచారి తెలిపారు. ఇప్పటికే లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయినా, వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల నుంచి సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లో రైతులు పెట్టుబడులు పెట్టి వరి సాగు చేపట్టినప్పటికీ నీటి కొరత కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరమని దినేష్ కులాచారి అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగునీటి విడుదలపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని ఆయన కోరారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో ఉన్న నీటి నిల్వల నుంచి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఏ మేరకు, ఎప్పటి నుంచి సాగునీరు విడుదల చేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా వారికి ప్రభుత్వం అండగా నిలవాలని దినేష్ కులాచారి కోరారు.