Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 5:49 pm Posted by : ramakrishna

వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

 

. . . అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల పైన భారాలు మోపుతూ వంట గ్యాస్ ధరలను 60 రూపాయలు, వ్యాపార సముదాయాలకు ఇచ్చే గ్యాస్ ధరలను 115 రూపాయలకు పెంచటం వలన మధ్యతరగతి ప్రజల పైన ధరల భారాన్ని మోపటమే అవుతుందని అందువల్ల పెంచిన ధరలను తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి వంట గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల పైన భారాలు వేయటానికి పూనుకున్నదని గతంలో చమురు నిల్వల ధరలు తగ్గినప్పటికీ ధరలు తగ్గించకుండా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయని సాకు చూపి ఆయిల్ ఉత్పత్తిదారులైన కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచే విధంగా ధరలను పెంచడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రజల ఆదాయాలు పెరగకుండా వారి వేతనాలు పెరగకుండా ధరలను పెంచటం మూలంగా దేశంలో పేదరికం మరింత పెరుగుతుందని ఆర్థిక ఇబ్బందులతో పేద మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడతారని ఆయన అన్నారు. పెట్టుబడుదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఎటువంటి పన్నులు విధించకుండా వారు మరింత కుబేరులుగా మారడానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అంతర్జాతీయంగా అమెరికా ఒంటెద్దు పోకడల మూలంగా ప్రపంచంలో అశాంతి నెలకొంటంతో పాటు యుద్ధాలకు కారణమవుతున్నారని అటువంటి అమెరికా పెత్తనానికి తలొగ్గి నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలకటం మానుకోవాలని అమెరికా చేసే ఏకపక్ష దుందుడుకు వైఖరిని ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకుముందు గ్యాస్ ధరలను పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయటానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు దిష్టిబొమ్మను అడ్డుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ నాయకులు కార్యకర్తలు తమకు నిరసనను వెలిబుచ్చే అధికారం ఉందని శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించవద్దని, మెప్పు పొందటానికి దిష్టిబొమ్మను అడ్డుకోవడం సరైనది కాదని వారు అన్నారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, నగర నాయకులు అనసూయమ్మ, అనిత, అంజయ్య, మాధవి, గణేష్, బుచ్చన్న, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.