. మాట ఇచ్చి ఢోకా ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటే
. మూడు సెపరేట్ బిల్లులు పెట్టాలి
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జనగామ, బతుకమ్మ: బీసీ బిల్లును రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని, మాటా ఇచ్చి ఢోకా ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జనగామలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 46శాతం బీసీలు ఉన్నారంటున్న ప్రభుత్వం 42శాతం బీసీ బిల్లు పెడతామంటోందని అన్నారు. ఆ 46 శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలని, అది కూడా ఒకే బిల్లుగా కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా మూడు బిల్లులు రూపొందించాలని కవిత డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆమె సూచించారు. బిల్లు పెట్టిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ కు వెళ్తేనే రిజర్వేషన్ ల సాధ్యమవుతుందని, కానీ బిల్లు పెట్టి కాలయాపన చేస్తే కోర్టులకు వెళ్లేవారు వెళ్తారనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని కవిత పేర్కొన్నారు.
ఇది మన విజయం
బీసీ రిజర్వేషన్ లకోసం బీఆర్ఎస్, జాగృతి పోరాడిందని చివరకు ప్రభుత్వం బిల్లు పెడతామని ప్రకటించడం మన విజయమని అన్నారు. మొదటి నుంచి తాము బీసీ పెద్దలను కలుపుకుని ముందుకు వెళ్లామని తెలిపారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఉమ్మడి రాష్ర్టంలోనే 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి డిమాండ్ చేసిందన్నారు.