నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీ, ప్రజాసంఘాల నాయకులపై నిర్బంధాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను ధర్నాచౌక్ వద్ద సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, సీపీఐ జిల్లా నాయకులు రఘురాం మాట్లాడుతూ అమిత్ షా పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీల ప్రజాసంఘాల నాయకులను ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు పిలుపు ఇవ్వకున్నా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఈ అక్రమ అరెస్టుల వల్ల వ్యక్తిగత బిజీ షెడ్యూల్ పనులను చేసుకోలేకపోతున్నారన్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇలా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనలకు పిలుపునిచ్చిన సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని అర్థం చేసుకుంటామని, కానీ నిరసనలకు పిలుపునివ్వని పార్టీల, సంఘాల నాయకులను అరెస్టుచేసి గంటల తరబడి పోలీసుస్టేషన్లలో కూర్చోబెట్టడం మానుకోవాలన్నారు. ప్రజలకోసం పనిచేసే వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులపై పోలీసు నిర్బంధాన్ని, అక్రమ, అరెస్టులను ఖండించాలని ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు పిలుపునిచ్చారు. అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటన వల్ల జిల్లా ప్రజలకు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పసుపు బోర్డును మరోసారి ప్రారంభించడం, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పసుపు బోర్డుకు అధికారులను, సిబ్బందిని, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఎం.నరేందర్, జిల్లా నాయకులు డి.రాజేశ్వర్, కే.గంగాధర్, డి.కిషన్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, సీపీఎం జిల్లా నాయకులు బి.సుజాత పీ.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, వివిధ ప్రజాసంఘాల నాయకులు కిషన్, సృజన్, గంగాధర్ చరణ్, సంతోష్, లక్ష్మి, వసంత్, సాయిలు, నరేష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.