Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:56 pm Posted by : ramakrishna

జీనోమ్ వ్యాలీలో యామ్జెన్ అత్యాధునిక పరిశోధన కేంద్రం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

గ్లోబల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ యామ్జెన్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో యామ్జెన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుళ్లపల్లి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన యామ్జెన్ ఇండియా ప్రతినిధులు హైదరాబాద్ కేంద్రంగా సంస్థ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న పరిశోధన కేంద్రం ద్వారా స్థానిక ప్రతిభావంతులకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఇటీవల యామ్జెన్ 3 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఔషధ రంగంలోని దిగ్గజ సంస్థలు తెలంగాణపై అపార విశ్వాసం చూపించడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ఒక ముఖ్యమైన వేదికగా మారడం పట్ల శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. యామ్జెన్‌లో ఉద్యోగ నియామకాల సందర్భంగా రాష్ట్రంలోని యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, జీనోమ్ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ కారణంగా తెలంగాణ ప్రపంచ లైఫ్ సైన్సెస్ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామ్జెన్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్‌ఫ్లమేషన్, శ్వాసకోశ వ్యాధులు, అరుదైన వ్యాధులు తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లో కొత్త పరిశోధన కేంద్రం ఏర్పాటు ద్వారా తెలంగాణలో లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాలకు మరింత ఊతం లభించనుంది. ఎంఓయూ కార్యక్రమంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్, యామ్జెన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, ఈడీ శ్రీను కొసరాజు, అనుమిత తదితరులు పాల్గొన్నారు.