నందిపేట్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు పథకంలో భాగంగా నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ పేదల కలలను సాకారం చేస్తున్నదని ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు అన్నారు. పథకం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మంగళవారం ఆయన మల్లారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు గృహ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, పనుల నాణ్యత మరియు పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ, “ఇల్లు లేని పేదల కలలు సాకారమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయంతో ఎన్నో నిరుపేద కుటుంబాలు తమ ఇంటి కలను నిజం చేసుకుంటున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి,” అని పిలుపునిచ్చారు. అలాగే హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశమై, ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారులకు తొందరగా మొదటి విడత బిల్లులు విడుదల చేయాలని సూచించారు. నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తవ్వాలన్నారు.