Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 2:34 pm Posted by : ramakrishna

నవోదయల ఏర్పాటుకు స్థలం కేటాయించండి

. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్

. ఆర్వోబీ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని..

. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఓఎల్ ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదిక అందజేయాలని కోరిన ఎంపీ

. సానుకూలంగా స్పందించిన రేవంత్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని జగిత్యాల, నిజామాబాద్ లో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎంను కలిశారు. ఆయన వెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. రెండు జిల్లాల్లో నవోదయల ఏర్పాటుకు ఒక్కో చోట 20 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ప్రతిపాదిత స్థలాలను ఈ సందర్భంగా అర్వింద్ సీఎంకు వివరించారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను వివరించారు. మాధవ్ నగర్ ఆర్వోబీ 50 – 50 పద్ధతిలో మంజూరుకాగా, అడవి మామిడిపల్లి ఆర్వోబీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని, ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు.  జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వే ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కోరారు. జగిత్యాల పట్టణానికి కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థల అన్వేషణ చేయాలని సీఎంని కోరారు.  జగిత్యాల పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ఎంపీ అర్వింద్ తో కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు. తమ విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.