. . . ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి
ఏర్గట్ల, బతుకమ్మ :
మెండోర మండలంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన ఆరోపణలను ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో 80 శాతం పనులు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో ఏర్గట్ల మండల కేంద్రానికి 40 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 20 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. నిర్మాణాలు పూర్తికాకుండా వదిలేయడం వల్ల ఇళ్లు నిరుపయోగంగా మారి అపరిశుభ్రతకు గురయ్యాయని అన్నారు. ఈ పరిస్థితిని సునీల్ కుమార్ గుర్తించాలని విమర్శించారు. బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉంటూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సునీల్ కుమార్, పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనుల పూర్తికి నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో బాల్కొండ నియోజకవర్గానికి, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎంత మేర నిధులు కేటాయించారో వెల్లడించాలని కోరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసని వారు పేర్కొన్నారు. ఇకపై కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇన్ని రోజులుగా వినియోగంలో లేకపోవడంతో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఏర్గట్ల గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఏర్గట్ల మాజీ జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఏర్గట్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, మండల పార్టీ నాయకులు, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.