Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 5:47 pm Posted by : ramakrishna

ఓటర్లు అందరూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకోవాలి

 

. . . నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటరు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఓటరు జాబితాను సమగ్రంగా పరిశీలించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా ఇప్పుడు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. 2002 ఓటర్ జాబితాలో పేరు ఉంటే, ప్రస్తుతం 2025 ఓటరు జాబితాలోని పేరుతో సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకోవచ్చని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ (మునిసిపల్ లో వార్డ్ ఆఫీసర్లు, కొన్ని చోట్ల అంగన్ వాడీ టీచర్లు, ఆర్.పీలు బి ఎల్ ఓ గా ఉన్నారు). వారి ద్వారా మ్యాపింగ్ చేయించుకోవచ్చని అన్నారు. మన ప్రస్తుత ఓటర్ కార్డ్ ని 2002 జాబితాలో ఉన్న వాళ్ళ ఓటర్ కార్డును లింకు చేసుకోవడం లేదా మనకు 2002లో ఓటు ఉంటే దాంతో మనం మనల్ని లింక్ చేసుకోవడం ద్వారా మ్యాపింగ్ చేసుకోవాలని కోరారు. బి ఎల్ ఓ ని కలిసి 2002లో ఓటర్ జాబితాలో తల్లితండ్రి ఎవరి పేరు ఉందో వాళ్ళ ఓటర్ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ నియోజకవర్గ పేర్లు వివరాలన్నీ అందజేస్తే, ప్రస్తుతం మీరు నివాసం ఉండే ప్రాంతం లో ఓటును మీ పేరుతో మ్యాపింగ్ చేస్తారని తెలిపారు. ప్రస్తుత ఓటు ఎక్కడుందో అక్కడి బి ఎల్ ఓ తోనే మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని కమిషనర్ సూచించారు. ఎస్ ఐ ఆర్ అనేది అందరికీ వర్తిస్తుందని, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మ్యాపింగ్ చేసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ పూర్తయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రీ మ్యాపింగ్ కొనసాగుతోందని, త్వరలో ఎస్ ఐ ఆర్ ప్రారంభమవుతుందని తెలిపారు. మ్యాపింగ్ ఎన్యూమనరేషన్ ఫామ్ తో పాటు ఈసీ పేర్కొన్న డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు. మ్యాపింగ్ పూర్తయిన వాళ్లు ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండదని అన్నారు.  2002 ఓటర్ జాబితాలోని వివరాలకు ప్రస్తుత జాబితాలోని వివరాలకు స్వల్ప తేడాలున్నా మ్యాపింగ్ పూర్తవుతుందని అన్నారు. ఎస్ ఐ ఆర్ ఆవశ్యకతను గుర్తిస్తూ, అందరూ మ్యాపింగ్ చేయించుకోవాలని కోరారు.