Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2024, 4:44 pm Posted by : ramakrishna

అందరూ కలిసి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి

  •  రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పాలకవర్గాలు, ఉద్యోగులు, అధికారులు కలిసి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సూచించారు. 71వ అఖిలభారత సహకార వారోత్సవాల సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ కార్యాలయంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ అధ్యక్షతన నిర్వహించిన సహకార సంస్థలను వ్యాపార అభివృద్ధి సంస్థలుగా మార్చడంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సహకార రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందు తరాలకు అందించాలంటే అందరం కలిసి సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కామన్ సర్వీసింగ్ సెంటర్ ద్వారా సంస్థను వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్లకపోతే సంస్థ మనుగడకే ఇబ్బంది ఉంటుందని అన్నారు. సహకారరంగ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, సంఘ సభ్యులు కలిసి ముందుకు వెళ్లాలని అందరూ  కంకణ బద్ధులై పని చేయాలని సూచించారు. సహకార సంస్థలు, డిసిఎంఎస్ ప్రస్తుతం వరి కొనుగోలు పై ఆధారపడి నడుస్తున్నాయని, గతంలో సహకార సంస్థలు వరి కొనుగోలు చేయకముందు ఉద్యోగుల జీతాలు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేదని అన్నారు. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఏమైనా అనివార్య కారణాలవల్ల ప్రభుత్వం వరి కొనుగోలు ఆపివేస్తే సంస్థ యొక్క ఉద్యోగుల మనుగడ ఏంటిదని అన్నారు. సంస్థ భవిష్యత్తు ఏలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని ఇతర ఏమైనా వ్యాపారాలు చేసే అవకాశాలను ఆలోచించుకోవాలని, దానికి తగ్గ కార్యాచరణ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా డీసీఎంఎస్ మనుగడ కొనసాగాలంటే ఎరువుల పంపిణీ ప్రారంభించాలని అన్నారు. అదేవిధంగా డిసిసిబికి ఉన్న పని మాదిరిగాని మార్క్ఫెడ్, డిసిఎంఎస్ లకు కలిపి అనుసంధానం చేసి మార్కెట్ చేసే పనులను డీసీఎంఎస్ ద్వారా కూడా చేయించాలని మార్క్ఫెడ్ ను రాష్ట్రవ్యాప్తంగా డీసీఎంఎస్ ను జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ సూచించి డిసిఎంఎస్ మనుగడకు దోహదపడాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. భవిష్యత్తులో సంస్థకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే దీర్ఘకాలిక ప్రాణాలికను సిద్ధం చేసుకోవాలని, ఉద్యోగులు సంతోషంగా ఉండాలంటే సంస్థ మనుగడ ముఖ్యమని మానాల అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సహకార సంస్థల సీఈఓ లు, చైర్మన్ లు ,డీసీఎంఎస్ ఉద్యోగులు అధికారులు, పాల్గొన్నారు.

All should develop cooperative sector together