. . . స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 15న సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుండగా, జిల్లా స్థాయిలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వ సలహాదారులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, రేషన్ కార్డు లు కలిగిన లబ్దిదారులు హాజరు కానున్న దృష్ట్యా, పక్కాగా ఏర్పాట్లు ఉండాలన్నారు. వేదికను అందంగా ముస్తాబు చేయాలని, ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ కూడా గందరగోళానికి తావు లేకుండా ముందస్తుగానే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీటింగ్ అరేంజ్మెంట్, పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు పురమాయించారు. అలాగే, ఈ నెల 15న ఉదయం వేళలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగం నివేదిక ఉండాలన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్ళను, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు, అనధికారులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రశంసా పత్రాల గ్రహీతలు, ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని అన్నారు. ప్రశంసా పత్రాల పంపిణీ, పతాక ఆవిష్కరణ, వేదిక అలంకరణ, టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టం, మైక్, ప్రోటోకాల్ ప్రకారంగా ప్రముఖుల ఆహ్వానం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర ఏర్పాట్లు, అగ్నిమాపక, వైద్య సేవలు తదితర అన్ని ఏర్పాట్లను సరి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఓ సాయన్న, సీ.పీ.ఓ కిషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
