. . . చెరుకు ఉత్పత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య
డిచ్ పల్లి, బతుకమ్మ :
16 సంవత్సరాలుగా మూతపడిన ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు రైతులంతా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్ పల్లి, నల్లవెల్లి గ్రామాల్లో రైతులను కలిసి ఈ నెల 13న జరగనున్న రైతు సమ్మేళనానికి హాజరుకావాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ తొలుత ఈ నెల 9న రైతు సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ, వివిధ గ్రామాల్లో పండుగల నేపథ్యంలో తేదీని ఆగస్టు 13కు మార్చినట్లు తెలిపారు. ఆగస్టు 13న చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించే రైతు సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రైతుల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి అప్పట్లో ఒక్కో రైతు రూ.100 చొప్పున షేర్లు చెల్లించి రూ.2.94 కోట్ల నిధులు సమకూర్చారని, ప్రభుత్వం రూ.50 లక్షల మూలధనం అందించిందని గుర్తుచేశారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభ సమయంలో సుమారు 6 వేల మంది రైతులు చెరుకు పండించి సరఫరా చేశారని, మరో 5 వేల మంది వరకు వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఉపాధి లభించిందని అన్నారు. రైతులు, కార్మికులకు అండగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ పాలకుల తప్పుడు విధానాలు, అధికారుల అవినీతి కారణంగా మూతపడిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తే రైతులంతా చెరుకు సాగుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉన్నందున సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరుతడి పంటల వైపు వెళ్లాలని సూచిస్తున్న నేపథ్యంలో చెరుకు కూడా ఆరుతడి పంట కాబట్టి, రైతులు చెరుకు సాగు చేయాలంటే ముందుగా ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలని ఆకుల పాపయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ గంగారెడ్డి, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, నల్లవెల్లి సర్పంచ్ కన్నె గంగాధర్, కొట్టె గంగాధర్, టేక్మాల్ లక్ష్మణ్, అగ్గు ఎరన్న, బాల్ రెడ్డి, గంగాధర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.