Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 5:31 pm Posted by : ramakrishna

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

 

. . . మేయర్ కూరగాయల ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఊర పండుగ వేడుకలకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించనున్న సంప్రదాయ ఊరపండుగ ఏర్పాట్లను పురస్కరించుకుని నగర మేయర్, నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఊరేగింపు మార్గాలు, ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులు, ఆలయ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించడంతో పాటు, ఊరేగింపు సాగే మార్గాల్లోని అన్ని ఎల్‌ఈడీ వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భక్తులు ప్రయాణించే మార్గాల్లో ఉన్న గుంతలను పూడ్చి రహదారులను సుగమంగా మార్చాలని అధికారులకు సూచించారు. పండుగ సమయంలో ట్రాఫిక్ మళ్లింపు, పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహించారు.

 

All facilities must be provided for the devotees.

 

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్ సేవలు, హెల్త్ క్యాంపులు సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రధాన కూడళ్ల వద్ద తాగునీటి చలివేంద్రాలు, విశ్రాంతి కోసం షామియానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నగర శాంతిభద్రతలకు, సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఈ ఊరపండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ ముగిసే వరకు కార్పొరేషన్ యంత్రాంగం పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ సానిటరీ సిబ్బంది, సర్వసమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో-కన్వీనర్ ఆదే ప్రవీణ్, కోఆప్షన్ సభ్యుడు నరేందర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు కరాటే రమేష్, బంటు బలరాం, ఆమ రాజు, లవంగ ప్రమోద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

All facilities must be provided for the devotees.