. . . తహశీల్దార్ కార్యాలయం ఎదుట టియుసిఐ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ధర్నా
రుద్రూర్, బతుకమ్మ :
బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా రూ 4000 పెన్షన్ అందజేయాలని నిరసిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయుసిఐ) బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2023లో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పథకం ద్వారా రూ. 4,000 వెంటనే ఇవ్వాలంటూ శుక్రవారం బీడీ కార్మికులతో అంగడి బజారు నుండి సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయము వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.మల్లేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినమైనటు వంటి జూన్ 2 నుండి కొత్త పెన్షన్లను ఇస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని దాంట్లో బీడీ కార్మికులకు కూడా చేయూత పథకము ద్వారా కట్ ఆఫ్ డేటును తొలగించి అర్హులైన వారందరికీ 2023లో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యెడల బీడీ కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్ చార్జికి అందజేశారు. బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను తీసుకోకపోవడంతో బీడీ కార్మికులు సమీకృత మండల భవన సముదాయంలో బైఠాయించి ధర్నా చేపట్టారు. బీడీ కార్మికులు వ్యక్తిగతంగా మేము ఇన్ని సంవత్సరాలుగా బీడీలు చేస్తున్నప్పటికీ కటాఫ్ డేటును తొలగించకపోవడంతో మాకు పెన్షన్ రాక బీడీ కార్ఖానాలు సరిగ్గా నడవక చేతినిండా పని లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ కటాఫ్ డేటును తొలగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చేయూత పథకం కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలంటూ బీడీ కార్మికులు వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను నింపి తీసుకువస్తే వాటిని ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తీసుకోకపోవడంతో కార్మికులందరూ అక్కడే బైఠాయించి వారి చర్యలకు నిరసనగా ఆందోళన చేశారు. దానితో సిబ్బంది దిగివచ్చి ఫారాలను తీసుకోవడానికి అంగీకరించడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ నాయకులు శోభ, బుజ్జి, లతా, శంకరమ్మ, లక్ష్మీ, గంగామణిలతో పాటు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.