Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 5:29 pm Posted by : ramakrishna

ఆ గ్రామాలలో మద్యం బంద్

  • మద్యం విక్రయిస్తే లక్ష జరిమానా.. ఏడు చెప్పు దెబ్బలు..

 

రాజంపేట, బతుకమ్మ: గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించారో లక్ష జరిమానా ఏడు చెప్పు దెబ్బలు తినాల్సిందే. ఇదేదో బావుంది అనుకుంటున్నారా! అవును మరి ఇది నిజమే.. ఒకప్పుడు ఆ గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిచేది. దీంతో చిన్న, పెద్ద, వృద్ధాప్యం, మహిళలు అని చూడకుండా ఎవరు పడితే వారు మద్యం తాగి పచ్చని కుటుంబాలలో చిచ్చులు ఏర్పడి  కుటుంబాలు బజారు పాలయ్యాయి. అలాగే సుమారు 30 మంది వరకు ప్రమాదాలకు గురై వికలాంగుల గా మారి మంచాలకే పరిమితమయ్యారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు అందరూ ఏకమై ఒక నిర్ణయానికి వచ్చారు. అదే రాజంపేట మండలంలోని  కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా  గుండారం, నడిమి తాండ, ఎల్లాపూర్ తాండ   గ్రామాలలో పూర్తిగా మద్య నిషేధాన్ని ప్రకటించారు.  గ్రామస్తులంతా ఏకమై ఒక చోట కూర్చొని ముక్కుముడిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయించిన లక్ష రూపాయల జరిమానా ఏడు చెప్పు దెబ్బలు తప్పని, విక్రయించినట్లు ఎవరైనా సమాచారం ఇస్తే పది నుండి 20వేల  రూపాయలు బహుమానం ఇస్తామంటూ మూడు గ్రామాల ప్రజలు ఒక దగ్గర కూర్చుండి తీర్మానం చేసుకున్నారు. తీర్మానం తో పాటు మండల స్థాయి అధికారులకు సైతం ఈ విషయం విన్నవించారు. అలాగే మూడు గ్రామాలలో యువత బైకులతో ర్యాలీ తీస్తూ గ్రామంలో ఎక్కడ కూడా మద్యం విక్రయాలు జరపరాదని నినాదాలు చేశారు.  ఇలా మద్యపాన నిషేధం చేయడంతో రాజంపేట మండలం ఉమ్మడి జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎక్సైజ్, పోలీస్ శాఖ తమకు సహకరించాలంటూ గ్రామస్తులు విన్నవిస్తున్నారు.

Alcohol ban in those villages