Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 8:12 pm Posted by : ramakrishna

ప్రాణాలను బలిగొంటున్న అక్బర్ నగర్ రహదారి

  • రోడ్డు విస్తీర్ణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
  • ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్

 

రుద్రూర్, బతుకమ్మ: రోడ్డు విస్తీర్ణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి విస్తీర్ణ పనులలో భాగంగా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో రోడ్డు విస్తీర్ణ పనులు చేపడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి  మరణించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గుంతలు, పగుళ్లు, రోడ్డు వాలు, సరిపడని రహదారి ఉపరితలం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇటీవలే అక్బర్ నగర్ గ్రామం వద్ద ఆటోను పెట్రోల్ ట్యాంక్ ఢీకొన్న ఘటనలో ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఓ వ్యక్తి మరణించాడని, గతంలో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తీర్ణ పనులలో కొంత వరకు తారు రోడ్డు వేసి మిగతా చోట్ల కంకర వేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తీర్ణ పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్డు విస్తీర్ణ పనులు, జరుగుతున్న ప్రమాదాల పై సదరు కాంట్రాక్టర్ కు గ్రామస్తులు ప్రశ్నించగా, కాంట్రాక్టర్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి  రోడ్డు విస్తీర్ణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Akbar Nagar road is claiming lives