Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 4:53 pm Posted by : ramakrishna

విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి

 

. . . కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తెలంగాణలో ప్రతిపాదిత వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెండు విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వరంగల్ కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. విమానాశ్రయం రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండటంతో పాటు కాకతీయ మెగా టెక్స్‌ టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వరంగల్‌ను మరింత పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వరంగల్ విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవర్‌హాలింగ్ (ఎంఆర్ఓ), ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ఇప్పటికే పూర్తయినందున టెండర్లు పిలిచి పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. విమానాశ్రయ డిజైన్లపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. వరంగల్ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా కాకతీయ కళా వైభవానికి అద్దం పట్టే విధంగా టెర్మినల్ భవన రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫీల్డ్‌ తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. రెండు విమానాశ్రయాలకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి అందజేస్తుందని స్పష్టం చేశారు. వరంగల్ తరహాలోనే ఆదిలాబాద్ విమానాశ్రయంలో కూడా ఎంఆర్ఓ, ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అలాగే రెండు విమానాశ్రయాల్లోనూ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్టీఓ)లను స్థాపించాలని ప్రతిపాదించారు. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్ సేవలను ప్రారంభించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాలు ఎన్నికల సమయానికే పరిమితం కావాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించి పరిష్కారం కనుగొంటున్నామని తెలిపారు. సమాచార లోపాలు ఉంటే పరస్పర సమన్వయంతో అధిగమిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను దేశంలో ఎక్కడా లేనంత వేగంగా పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. త్వరితగతిన భూములు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయ డిజైన్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ – అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావుతో పాటు పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.