Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 8:11 pm Posted by : ramakrishna

ఎఐకెఎంఎస్ 11వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలి

 

. . . జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా 11వ మహాసభను ఈ నెల 23వ తేదీ శనివారం మోపాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య తెలిపారు. ఈ మహాసభకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. గురువారం సాయినగర్‌లో ఏర్పాటు చేసిన ఎఐకెఎంఎస్ సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వాల తప్పుడు విధానాల కారణంగా రైతులకు యూరియా సమస్యలు తీరడం లేదని, పంట పండించిన తర్వాత ధాన్యం అమ్ముకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కాపలా కాస్తూ తీవ్ర ఎండలకు అస్వస్థతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా, గత ప్రభుత్వంలాగానే రైతులను మోసం చేసిందని విమర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మంచిప్ప 21 ప్యాకేజీ పనులకు సరైన నిధులు కేటాయించకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టం, ఉపాధి పనులలో తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టాలు రైతు, రైతు కూలీలకు వ్యతిరేకమని భూమయ్య పేర్కొన్నారు. రైతులను భూముల నుండి, వ్యవసాయం నుండి దూరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మోదీ ప్రభుత్వ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత మహాసభ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన రైతాంగ, ప్రజా ఉద్యమాలను ఈ మహాసభలో సమీక్షించి, భవిష్యత్తులో రైతాంగ పోరాటాలను మరింత తీవ్రతరం చేసే దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23న జరిగే జిల్లా మహాసభలకు అధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, న్యూ డెమోక్రసీ నాయకులు బండమీది నరసయ్య, అగ్గు చిన్నయ్య, గుడ్డోల్ల గంగాధర్, వేల్పూర్ భూజేందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.