. . . ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. అనలాగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మన్, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్, ఎంసీఆర్హెచ్ఆర్డి లో బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమావేశంలో దేశంలో సంయుక్త పర్యవేక్షణలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌పై సంస్థలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్ట్ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సాంకేతిక వ్యవస్థ నగర ట్రాఫిక్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలను అందించే తదుపరి తరం మేధస్సు ఆధారిత పరిష్కారంగా ప్రతిపాదించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా యంత్రాలు వాస్తవ పరిస్థితులను గుర్తించి, వాటిని విశ్లేషించి, తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పొందుతాయని అనలాగ్ ప్రతినిధులు వివరించారు. ముందుగా ప్రోగ్రామ్ చేసిన విధానాలపై మాత్రమే ఆధారపడకుండా, నిరంతర అభ్యాసం ద్వారా వ్యవస్థ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేసి, వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీ, అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సాంకేతికతలో భాగంగా సెన్సర్లు, రోబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాధనాలను వినియోగించి సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చు. కాగ్నిటివ్ సిటీస్ కాన్సెప్ట్‌లో భాగంగా ట్రాఫిక్ రద్దీని ముందుగానే గుర్తించడం, సమస్యలను అంచనా వేసి పరిష్కరించడం, విద్యుత్ వినియోగాన్ని అవసరానికి అనుగుణంగా నిర్వహించడం, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలకు ప్రత్యేక మార్గాలను కల్పించడం వంటి అంశాలను అమలు చేయవచ్చని ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అనలాగ్ సంస్థ ఎంఈఐఎల్ మధ్య ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. ఈ భాగస్వామ్యం తెలంగాణలో భవిష్యత్ సాంకేతికత ఆధారిత పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
