- ప్రభుత్వం మారగానే శిఖం భూమికి పట్టా
- ఇరిగేషన్ స్థలానికి ఎన్ఓసి ఇచ్చిందెవరు?
- ప్రభుత్వ స్థలం అని రికార్డులు ఉంటే నాలా కన్వర్షనా?
- యంత్రాంగాలు అన్ని కబ్జా రాయుళ్లకు వత్తాసు
- జిల్లా కేంద్రంలో కోట్ల విలువ చేసే ఇరిగేషన్ స్థలం కబ్జా
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బోర్గాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 15 వందల మంది విద్యార్ధులు చదువుతుంటే ప్రతి ఏటా జూన్ మాసంలో అడ్మిషన్ క్లోజ్ అని పెట్టే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఎంతో మందికి 10/10 జిపిఏలు సాధించిన విద్యార్థులు ఉండగా, ట్రిపుల్ ఐటికి కుడా విద్యార్ధులు ఎంపిక అవుతుంటారు. అది పేరుకు జిల్లా పరిషత్ పాఠశాల ఐనప్పటికి ప్రస్తుతం నగర పాలక సంస్థ పరిధిలో విలీన గ్రామం. అలాంటి స్కూల్ విద్యార్ధులకు ఆడుకునేందుకు క్రీడా స్థలం లేకపోవడంతో స్థానిక గ్రామస్ధులు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బాజిరెడ్డికి మొరపెట్టుకున్నారు. దానితో స్థానికంగా జిల్లా పరిషత్ పాఠశాలను అనుకుని ఉన్న 586 సర్వే నంబర్ లో ప్రభుత్వ శిఖం భూమి 2.38 ఎకరాలు ఉండగా దానిని పాఠశాల క్రీడా స్థలానికి కేటాయించాలని ఆదేశించారు. అప్పటి వరకు అక్కడ భూమి పడావుగా ఉండగా చుట్టు పక్కల సాగు చేస్తున్న రైతులు కబ్జా చేసేందుకు యత్నించడంతో అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు. దాదాపు దశాబ్ధకాలంగా అక్కడ సర్కారు స్థలం అని మోపాల్ తహసీల్థార్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ భూముల విలువ కోట్లకు చేరింది. దానితో స్వతహాగా పడావు భూములు, వివాదాస్పద భూములపై కన్నేసే కబ్జాదారుల కన్న శిఖం భూమిపై పడటంతో అభూమికి రెక్కలొచ్చాయి. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీన్ మారిపోయింది.
బోర్గాంలో ప్రస్తుతం సర్వే నంబర్ 586 లో ఉన్నసర్కారు శిఖం భూమికి పట్టా వచ్చింది. అక్కడ రైతులకు 1 ఎకరం ఉండగా మిగిలిన ప్రభుత్వ భూమి కలుపుకుని పట్టాలను ఇచ్చింది రెవిన్యూ శాఖ. అసలు 1954 నుంచి 2016 వరకు అది ప్రభుత్వ శిఖం భూమి అని ఉన్న స్థలంకు ఇరిగేషన్ శాఖ ఎలా ఎన్ఓసి ఇచ్చిందనేది మిలియన్ డాలర్ ల ప్రశ్న. అంతే గాకుండా గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు ఎన్ఓసి భూముల వ్యవహరంలో కోట్లు కూడబెట్టుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. వారి హయాంలోనే అక్కడ పట్టా కోసం పంచాయతీ యంత్రాంగం వద్ద పట్టాలెక్కినట్లు తెలుస్తుంది. జిల్లాలో ఘనత వహించిన రెవిన్యూ సంఘం నేత ఒక్కరు అంతా దగ్గర ఉండి శిఖం భూమికి పట్టా లు ఇప్పించారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా పట్టాలు రాగానే రెవిన్యూ అధికారులు రికార్డులు పరిశీలించకుండానే నాలా కన్వర్షన్ ఇచ్చారా లేక ఇప్పుడు అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులకు బల్ధియా అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
ఒక ఎమ్మెల్యే పేద విద్యార్ధులు చదివే స్కూల్ కు క్రీడా స్థలం కు సర్కారు భూమిని కేటాయించాలని సిఫారసు చేస్తే ఆగిన కబ్జాలు ప్రభుత్వం మారగానే పట్టా ఎలా వచ్చాయని చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బోర్గాం( పి) గ్రామం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో విలీనం అయింది. నగరంలో ప్రజలు ఇతర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా పట్టా చేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోట్ల విలువ చేసే 2.38 ఎకరాల భూమి ప్రభుత్వం మారగానే ఎక్కడ మాయం అయిందని, దానికి పట్టా ఎలా ఇచ్చారని చర్చ జరుగుతుండగానే నాలాకన్వర్షన్ రావడం అక్కడ కబ్జాదారులు ప్రైవేట్ వెంచర్ ఏర్పాటుకు చకా చకాపావులు కదుపుతుంటే అధికార యంత్రాంగాలు వంతపాడటం విస్మయం కలిగిస్తుంది. రాత్రికి రాత్రే వెంచర్ పనులు జరుగుతండగా, చుట్టు పక్కల పెన్సింగ్ పనులు గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణ పనులు జరుగుతుండటం దారుణం. పేదలు 50 గజాలు కబ్జా చేస్తే నోటిసులు ఇచ్చే ప్రభుత్వ శాఖలు కోట్ల విలువ చేసే 2.38 ఎకరాల భూమి పెద్దల పాలవుతుంటే పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది.ఈ స్థలం స్కూల్ కు కేటాయించాని విద్యార్థి సంఘాలు కుడా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.