- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతులు పండించిన వరి మొక్కజొన్న సోయాబీన్ పంటలకు షరతులు విధించకుండా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ వరి మొక్కజొన్న సోయా పంటలు మార్కెట్ కు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు మందకొడిగా ప్రారంభిస్తున్నారు. ఈసారి వరి ధాన్యం ఉత్పత్తి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 149 లక్షల టన్నులతో దేశంలో కెల్లా ప్రథమ స్థానంలో ఉండవచ్చని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ కేవలం 75 లక్షలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అన్నారు. మిగతా పంటను మిల్లర్స్ కొనుగోలు చేస్తారేమో? 8337 కొనుగోలు కేంద్రాలు ఎలా సరిపోతాయి అని ఆయన అన్నారు. ఎవరు ఎక్కడ కొన్న సాధారణ వరి రకానికి ఎంఎస్పీ ధర 2,369 రూ, గ్రేడ్ ఎ కు 2,389రూ, అమలుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ వర్తింపజేయాలి. 48 గంటల లోపు ధాన్యం ఖరీదు చేసిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. మిల్లర్స్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా 40 కిలోల తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కేంద్రానికి చేరిన తర్వాత రక్షణ బాధ్యత ప్రభుత్వంది, కొనుగోలు కేంద్రాలదే, అడిగిన రైతులందరికీ 80 శాతం సబ్సిడీపై డ్రయర్ మిషిన్లు అందజేయాలని అన్నారు. తగినన్నీ టార్పాలిన్ లను రైతులకు అందించాలన్నారు. జిల్లాలో బైల్డ్ రైస్ మిల్లులు అధిక సంఖ్యలో ఉన్నందున ధాన్యం తేమశాతం చూడకుండా అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, అగ్గు ఎర్రన్న,దేవస్వామి, బి, బన్సీ నాయక్, సాయిలు,గంగారాం, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
