- గోల్డెన్ జూబ్లీ అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి
- అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాధీర్ షా రజానీ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులోని గోల్డెన్ జూబ్లీ ఇంటర్మీడియట్ కళాశాలకు అనుమతులు లేకుండానే యజమాన్యం అడ్మిషన్లు చేపడుతుందని అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాధీర్ షా రజానీ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గోల్డెన్ జూబ్లీ కళాశాలకు అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు సంబంధించిన భవనంను కొన్ని సంవత్సరాలుగా గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాల నిర్వాహణకు లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే సంబంధిత లీజు గడువు ముగిసిందని, అంతేగాకుండా లీజు గడువు ముగిసినా ఎటువంటి ఒప్పంద ప్రక్రియ లేకుండానే జూనియర్ ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో భవనాన్ని ఖాళీ చేయాలని ఇది వరకే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో వివాదం చెలరేగకుండా ట్రస్టు నుంచి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తీర్పుకు తనకే అనుకూలంగా వచ్చిందని తెలిపారు. గోల్డెన్ జూబ్లీ జూనియర్ కళాశాల భవన లీజు గడువు ముగిసిన విషయంపై ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వారు నిజామాబాద్ డిఐఈవోకు విచారణకు ఆదేశించారని తెలిపారు. అయితే ట్రస్టు లీజు గడువును ముగిసినా ఆ విషయాన్ని దాచి అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీకి ఇంటర్మీడియట్ బోర్డులో అనుమతి విషయం ఆన్ లైన్ లో కనిపించడం లేదన్నారు. కానీ ఇప్పటికి ఈ విషయంను గోప్యంగా ఉంచి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు కొనసాగిస్తున్నారని ఈ విషయంపై డిఐఈవోకు ఫిర్యాదు చేశామన్నారు. వారు ఇప్పటికే నోటీసులు జారీ చేశారని ట్రస్టు కార్యదర్శి నాధీర్ షా రజానీ తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా అడ్మిషన్లు తీసుకుంటున్న గోల్డెన్ జూబ్లీ కళాశాలపై చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అల్ ముర్తుజా ఎడ్యుకేషన్ ట్రస్టు కోశాధికారి రజియాతో పాటు, సిబ్బంది పాల్గొన్నారు.