. . . పోస్టర్ ని ఆవిష్కరించిన మండల విద్యాశాఖ అధికారి
లింగం పేట్, బతుకమ్మ :
లింగంపేట్ మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి. వెంకట రాములు తెలిపారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి షౌకత్ అలీ పాల్గొని అడ్మిషన్ల పోస్టర్ని ఆవిష్కరించారు. మైనార్టీ వర్గాల వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ పి. వెంకట రాములు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభమైన 2017 వ సంవత్సరం నుండి కూడా ఉత్తమ నిర్వహణతో పాటు అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు పదవ తరగతిలో ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధిస్తుందని తెలిపారు. సహా పాఠ్య కార్యక్రమాలలోనూ, క్రీడలలోనూ పాఠశాల స్థాయి దాటి మండల స్థాయి, జిల్లాస్థాయిలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా తమ పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు తెలిపారు. తమ విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఐఐటి బాసర వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఉన్నత చదువులకు అవకాశం పొందారని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా తమ విద్యార్థులు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడే చెకుముకి సైన్సు సంబురాలు లోనూ, రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలోనూ తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పోటీపడి ఉత్తమ స్థానంలో నిలవటం పాఠశాలకు గర్వకారణమన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తమ పాఠశాలలో ఉత్తమ, నాణ్యమైన విద్యతో పాటుగా ప్రభుత్వం అన్ని రకాల ఉచిత సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు. వచ్చే 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతిలో మైనారిటీ పిల్లలకు 30, ఇతరులకు 10 సీట్ల చొప్పున అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. 6, 7, 8వ తరగతిలలో గత సంవత్సరం మిగిలిన ఖాళీలకై కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా మైనార్టీ గురుకుల కళాశాలలో కూడా ఎంపీసీ, బైపిసి కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నావని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ వాహిన్షీద్ సిద్దిఖీ, సదర్ లు ఫరూఖ్, వాహిద్, కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ రఫీక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాసిఫ్, మండల యువజన విభాగం అధ్యక్షులు ఖయ్యూం, అర్షద్, మౌల్వి నజీరుద్దీన్ లు, పాఠశాల సమన్వయకర్త రామ్ గోపాల్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపక బృందాలతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
