Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:29 pm Posted by : ramakrishna

అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

 

. . . మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని అనేక మంది ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలు సొంత ఇళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ మంత్రికి వివరించారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకాశం దక్కని అర్హులైన నిజమైన లబ్ధిదారులకు కూడా అవకాశం కల్పించేలా అదనంగా 2,000 ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పొందిన లబ్ధిదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను, నిర్మాణ దశలకు అనుసంధానమైన విడతల చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. నిధులు సకాలంలో అందితే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.